స్వామివారు పంచాననం వారికి కాలజ్ఞానమును చెప్పటం.
స్వామివారు పంచాననం వారికి కాలజ్ఞానమును చెప్పటం.
శ్రీముఖ నామ సంవత్సరమున శ్రీ వీరభోగ వసంతరాయులనై వచ్చి పరిపాలనా బాధ్యత స్వీకరిస్తాను. మహానందికి ఉత్తరాన అనేకమంది మునులు పుట్టుకొస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు.
5000 సంవత్సరం వచ్చేసరికి బ్రాహ్మణులు సంకరవృత్తులను చేస్తూ, తమ వైభవం కోల్పోతారు. ఏ కులం వారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్ధులు, యోగులు జన్మించిన ఆ బ్రాహ్మణకులము పూర్తిగా వర్ణసంకరం అవుతుంది.
ఆనాటికి ప్రజలలో దుర్భుద్ధులు అధికమవుతాయి.
కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కుపోగును తాకుతుంది.
రాజాధిరాజులు అణిగి ఉంటారు.
శూద్రులు విలాసాలను అనుభవిస్తూ, రాజుల హోదాలో వుంటారు. వారి ఇంట ధనలక్ష్మి నాట్యమాడుతూ వుంటుంది.
నా భక్తులయిన వారికి నేనిప్పుడే దర్శనమిస్తాను. కానీ వారి నెత్తురు భూమిమీద పారుతుంది. కొంత భూభారము తగ్గుతుంది.
దుర్మార్గుల రక్తముతో భూమి తడుస్తుంది.
చీమలు నివసించే బెజ్జాల్లో చోరులు దూరతారు. దురాలోచనలు మితిమీరుతాయి. అందువల్ల చోరులు ప్రత్యేకముగా కనపడరు. బిలం నుంచి మహానంది పర్వతము విడిచి వెళ్తుంది.
గడగ్, లక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, అలిపిరి, అరవరాజ్యము, వెలిగోడు, ఓరుగల్లు, గోలకొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి.
నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు.
క్షత్రియులు అంతరిస్తారు.
చలనేంద్రియయములు, ఆయుధాల చేత, బాణముల వల్ల నశిస్తాయి.
ఉత్తర దేశాన భేరి కోమటి ‘గ్రంథి’ అనే మహాత్ముడు అవతరిస్తాడు. అందరిచే పూజింపబడతాడు.
అందరూ పాటించవలసిన కొన్ని ధర్మములను గురించి నీకు చెబుతాను ... విను …
తాము భోజనము చేయబోయే ముందుగానే ఇతరులకు పెట్టటం ఉత్తమ ధర్మం. తాము భోజనం చేసి యింకొకరికి పెట్టటం మాధ్యమం, ఫలాపేక్షతో ఒకరికి అన్నదానం చేయటం అధమం. చాలకుండా అన్నం పెట్టటం అధమాధమం. దానాలన్నిటిలోనూ అన్నదానం అత్యుత్తమం.
కలియుగం 4808 సంవత్సరములు గడిచిన తరువాత కొట్లాటలు ఎక్కువవుతాయి.
నిద్రాహార కాల పరిమితులు పాటించక మానవులు ధర్మహీనులవుతారు.
శాంత స్వభావం కలవారు కూడా కోపాన్ని ఆపుకోలేకపోతారు.
పిల్లలు పెద్దలను ఆశ్రయించుటకు బదులు, పెద్దలే పిన్నలను ఆశ్రయిస్తారు.
దుష్టమానవుల బలం పెరుగుతుంది.
రాజ్యాలేలిన వారు భిక్షాటనకు దిగుతారు. భిక్షమెత్తిన వారు ఐశ్వర్యమును పొందుతారు.
కుటుంబాలలో సామరస్యత తొలగిపోతుంది. వావి వరసలు నశిస్తాయి.
బ్రాహ్మణనింద, వేదనింద, గురువుల నిందలు ఎక్కువవుతాయి.
జారుత్వం, చోరత్వం, అగ్ని, రోగ, దుష్టులవలన ప్రజలు పీడింపబడతారు.
అడవిమృగాలు పట్టణాలు, పల్లెలలో తిరుగుతాయి.
మాల, మాదిగలు వేదమంత్రాలు చదువుతారు.
ఏనుగు కడుపున పంది, పంది కడుపున కోతి జన్మిస్తాయి.
రక్త వాంతులు, నోటిలో పుండ్లు వలన, తలలు పగలడం వలన జనం మరణిస్తారు (ఇది అణు దాడి వల్ల సంభవించే కాన్సర్ తదితర వ్యాధుల వల్ల జరగవచ్చు)
కొండల మీద మంటలు పుడతాయి.
జంతువులూ గుంపులు గుంపులుగా మరణిస్తాయి.
భారతదేశము పరుల పాలనలోకి వెళుతుంది. ఈ పాలనలో అన్ని వర్ణాల వారు చదువుకుంటారు. కులం, ఆచారం నశిస్తాయి. మనుషులందరూ కలిసి మెలిసి, కుల మత వర్ణబేధాలు లేక ప్రవర్తిస్తారు.
ఎడ్లు లేకుండా బండ్లు నడుస్తాయి.
మంచినీటితో జ్యోతులు వెలుగుతాయి.
ఒకే రేవున పులి, మేక నీరు తాగుతాయి.
వెంపలి మొక్కకు నిచ్చెనలు వేసే మనుష్యులు పుడతారు.
విజయనగర వైభవము నశిస్తుంది.
కాశీ నగరం పదిహేను రోజులు పాడుపడిపోతుంది.
గోదావరి నది పన్నెండు రోజులు ఎండిపోయి తిరిగి పొంగిపొర్లుతుంది.
వేంకటేశ్వరుని కుడిభుజం అదురుతుంది. మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి.
కృష్ణానది మధ్యలో బంగారు రథం కనిపిస్తుంది. ఆ రథాన్ని చూసిన వారి కళ్ళుపోయి, గుడ్డివారవుతారు.
కర్ణాటక దేశంలో దేవాలయాలను తురకలు ధ్వంసం చేస్తారు.
కుక్కలు గుఱ్ఱాలను చంపుతాయి.
ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి.
నేల నెత్తురుతో తడిచిపోతుంది .చనిపోయిన వారి ఎముకలు గుట్టలుగా పడి వుంటాయి.
దుష్టశక్తులు విజ్రుంభిస్తాయి. అందువల్ల జననష్టం జరుగుతుంది. కాకులు కూస్తాయి, నక్కలు వూళలు వేస్తాయి. ఫలితంగా ప్రజలు మరింతమంది గుంపులుగా మరణిస్తారు.
కొండవీటి రాతిస్థంభం కూలిపోవటం తథ్యం.
కలియుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు. బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతిముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి.
పసిబిడ్డలు మాట్లాడతారు. ఒకరి భార్య మరొకరి భార్యగా మారుతుంది.
కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తరాన వింత వింత చుక్కలు కన్పిస్తాయి. అవి అయిదు నెలలపాటు వుంటాయి.
వేంకటేశ్వరుని సొమ్ము దొంగలు అపహరిస్తారు.
కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతమందు జనులు ఎక్కువగా నశిస్తారు.
ప్రజలు గ్రామాలు వదిలి అడవులకు వెళ్ళిపోతారు.
అనేక రకాలయిన జబ్బుల వలన పలువురు మరణిస్తారు.
అమావాస్య నాటి అర్థరాత్రి సమయాన ఉదయగిరి శిఖరం మీద చక్రాంకితుడైన ఒక పరమహంస ఎక్కి నిలిచి వుండడం చూసి, చంద్రగ్రహణం అని జనులు ఆశ్చర్యం చెందుతారు.
ఆకాశమార్గాన రెండు బంగారు హంసలు వచ్చి, పట్టణాల్లో సంచరిస్తాయి. దురాశాపరులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించి సర్వ నాశనమైపోతారు.
ఆకాశాన తూర్పు పడమరలు కాషాయరంగున కనిపిస్తాయి.
కొండల నుండి పెద్ద పెద్ద ధ్వనులు వినిపిస్తాయి.
వీరభోగవసంతరాయులునై నేను వచ్చులోపల ఇలాంటి వింతలూ అనేకం జరుగుతాయి’’ అని చెప్పి బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ముగించారు.