సమాధికి ముందు కాలజ్ఞానము
సమాధికి ముందు కాలజ్ఞానము
“నేను పుట్టబోయే సమయంలో అనేక నక్షత్రాలు భూమిపైకి రాలతాయి.ఏడు గ్రామాలకు ఒక గ్రామమవుతుంది. అంటే ప్రాణనష్టం జరుగుతుంది. ఆ సమయంలో లక్షలాది పశువులు మరణిస్తాయి. ధూమకేతువు అనే నక్షత్రం పుడుతుంది.
చిన్న చిన్న పాలెగాళ్ళ సామ్రాజ్యాలు అంతమైపోతాయి. ఎర్రబోయీల జీవన విధానాలను వీరు అనుసరిస్తారు.
విరోధి నామ సంవత్సరంలో లింగాలపాటిలో ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తి ‘అంకమ్మ’ అనే పేరుతో లోకమంతా సంచరించి, దగ్ధం చేసి తిరిగి నందికొండ వస్తుంది.
పింగళనామ సంవత్సరంలో ధూమకేతు పుట్టి అదృశ్యమవుతుంది.
గొప్ప దేశములు, దేవాలయములు నశిస్తాయి.
సిద్దాత్రి నామ సంవత్సరాన అద్దంకి సీమలో భూమి వణుకుతుంది.
రౌద్రినామ సంవత్సరాన ఆషాఢమాసంలో, మహా ధ్వని చేస్తూ నక్షత్రాలు రాలుతాయి. అప్పుడు పర్వత గుహల్లో ఉదక పానీయములు తయారు చేస్తారు.
బంగాళ దేశంలో కాళి ప్రత్యక్షమై శక్తి రూపియై రక్తం గటగటా తాగుతుంది.
బెజవాడ గోలకొండ అంత పట్నమవుతుంది.
మేఘం, అగ్నిసర్పాకారంగా వచ్చి ధ్వనులు చేస్తాయి.
పిడుగులు, శ్రీశైలాన నంది చెరువులో ఆరెదొండచెట్టు పుడుతుంది. భ్రమరాంబ గుడిలో మొసళ్ళు చొరబడటంతో గుడి పాడయి పోయెను. ఈశాన్యంలో పాతాళగంగ కృంగి మల్లిఖార్జునుడు అదృశ్యమైపోతాడు.
పాతాళ గంగలో శాపవశాత్తూ వున్న చంద్రగుప్తునికి కలికి అవతార పురుషుని పాదం సోకి, శాప విముక్తుడవుతాడు. ఆకాశాన విషగాలి పుట్టి, ఆ గాలి వల్ల, రోగాల వల్ల జనులు నశిస్తారు.
తిరుపతి వేంకటేశ్వరుని గుళ్ళో మొసళ్ళు ప్రవేశించి, మూడు రోజులు పూజలు లేక తలుపులు మూసి వుంచుతారు.
గరుడధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి.
తిరువళ్ళువరు వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి.
ఆకాశాన మూడు నక్షత్రములు ఉదయించి, కన్పించకుండానే అదృశ్యమవుతాయి.
ఆనంద నామ సంవత్సరంలో శ్రీశైల మల్లిఖార్జునుడు ఉత్తరాన వింధ్య పర్వతాలకు పోయి, నిజ రూపం చూపుతాడు. అప్పుడు ఆ రాజ్యం తల్లడిల్లిపోతోంది.
దేశాన కొత్త కొత్త జాతులు పుట్టుకొస్తాయి. అన్ని కులాలవారు మద్యపాన ప్రియులవుతారు.
రాజులకు రాజ్యాలు ఉండవు.
వ్యవసాయ వృత్తినే అవలంభిస్తారు.
అన్ని జాతుల వారు వింత వింత వస్త్రాలు ధరిస్తారు.
బ్రాహ్మణులకు పీటలు, యితరులకు మంచాలు వస్తాయి.
బ్రాహ్మణులు విదేశీ విద్యలు, విజ్ఞానానికి భూములను అమ్ముకుంటారు. ప్రభుత్వ బంట్లుగా ఉద్యోగాలు చేస్తూ బతుకుతారు. వానిలో కూడా బ్రాహ్మణులకు ఆధిక్యత లేకపోగా అన్య కులాల వారే ఆధిక్యత పొంది వారి కింద పని చేస్తారు. జీవనోపాధి కోసం ఏ వృత్తినయినా చేసే స్థితికి వస్తారు.
పౌరోహిత్యం కూడా కొనసాగక బ్రాహ్మణులు బాధలు పడతారు.
విదేశీ విజ్ఞానం విద్యలు నేర్చుకుంటారు. ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఉన్నత స్థితికి చేరుకుంటారు’’
ఫాల్గుణ మాసంలో నేను వీరభోగ వసంతరాయులనై శ్రీశైలం వెళ్ళి అక్కడి ధనాన్ని బీదలకు పంచిపెడతాను. తరువాత ఉగ్రమైన తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి నుండి మూడు వరాలు పొందుతాను.
విక్రమ నామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి రోజున బెజవాడ ఇంద్రకీలాద్రికి వస్తాను. అక్కడ ఋషులను దర్శించి, తరువాత కార్తవీర్యార్జున దత్తాత్రేయులవారి వద్ద పలు విద్యలు అభ్యసించి, ఆది దత్తాత్రేయులవారిని దర్శించి, అక్కడి నుండి మహానందికి వెళ్ళి రెండు నెలలు గడుపుతాను. అనంతరం శ్రావణ నక్షత్ర యుక్త కుంభ లగ్నాన వీరనారాయణపురం చేరతాను. అక్కడ 15 దినములు గడుపుతాను.
కలియుగాన 3040 సంవత్సరాలు గడిచిపోయేటప్పటికి పుణ్యతీర్థాలు క్రమ క్రమంగా తమ పవిత్రతను కోల్పోవటం జరుగుతుంది. గంగానది పూర్తిగా అంతర్థానమయిపోతుంది.
ప్రపంచాన ధనమే అన్నింటికీ మూలమౌతుంది.
పాతాళ గంగలో నీరు ఇంకిపోతుంది.
నూట యిరవై తిరుపతులు నీటిపాలయిపోతాయి.
నాలుగు సముద్రాల మధ్య నున్న ధనమంతా శ్రీశైలం చేరుకుంటుంది.
సముద్రాలు కలుషితమయిపోతాయి. జల చరములు – ఎక్కడివక్కడే నశించిపోతాయి.
బంగారు గనుల కోసం కొండల్లో బతికేందుకు ప్రజలు మక్కువ చూపుతారు.
కాశీనగరంలో కొట్లాటలు జరుగుతాయి.
వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఎక్కువ అయిపోతాయి.
కలహాలు, కల్లోలాలు మితిమీరిపోయాయి.
కుటుంబంలో సామరస్యత వుండదు. వావీ వరసలు వల్లకాట్లో కలుస్తాయి.
సృష్టి మొత్తం తెలిసిన యోగులు పుడతారు.
రెంటాల చెరువు క్రింద ఆపదలు పుడతాయి.
వినాయకుడు వలవల ఏడుస్తాడు.
గోలుకొండ క్రింద బాలలు పట్నాలు ఏలుతారు.
శృంగేరి, పుష్పగిరి పీఠాలు పంచాననం వారి వశమవుతాయి.
హరిద్వార్ లో మర్రిచెట్టు మీద మహిమలు పుడతాయి. హరిద్వారానికి వెళ్ళే దారి మూసుకుపోతుంది.
అహోబిలంలోని ఉక్కుస్థంభం కొమ్మలు రెమ్మలతో, జాజిపూలు పూస్తుంది.
నా రాకకు ముందుగా స్త్రీలు అధికారాన్ని అందుకుంటారు.
కులాధిక్యత నశించి వృత్తిలో ఎక్కువ తక్కువలు అంటూ లేక అందరూ సమానమయిపోతారు’’