సమాధి తర్వాత తిరిగి దర్శనం
సమాధి తర్వాత తిరిగి దర్శనం
నవమి నాటి రాత్రికి సిద్దయ్యను బనగానపల్లెకు పంపి పువ్వులు తెప్పించమని గోవిందమాంబకి ఆదేశించారు స్వామి. వెంటనే సిద్దయ్య బనగానపల్లెకు ప్రయాణం అయ్యాడు.
సిద్దయ్య తిరిగి వచ్చేసరికి స్వామి సమాధిలో ప్రవేశించటం పూర్తయిపోయింది. అది తెలుసుకున్న సిద్దయ్య తీవ్రంగా దుఃఖించి ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. సమాధి నుంచి అది తెలుసుకున్న బ్రహ్మంగారు సిద్దయ్యను పిలిచి, సమాధిపై వున్న బండను తొలగించమని తిరిగి పైకి వచ్చారు.
అప్పుడు సిద్దయ్య కోరిక ప్రకారం ‘పరిపూర్ణ స్థితిని’ బోధించారు.
********
బ్రహ్మంగారు వైదిక ధర్మమును అవలంభించారు. అయితే, ఎప్పుడూ కుల మతాతీతులుగా ప్రవర్తించారు తప్ప ఏనాడూ సంకుచిత కులాభిమానమును గానీ, మాట ద్వేషమును గానీ ప్రదర్శించలేదు. దూదేకుల కులస్థుడైన సైదులును తన శిష్యునిగా స్వీకరించి, అనేక విషయాలను, శాస్త్ర రహస్యాలను అతనికి వివరించారు.
సమాధి అయిన తరువాత కూడా అతనికే దర్శనమిచ్చి దండ కమండల పాదుకలు, ముద్రికను కూడా ప్రసాదించారు. తమ కొడుకులకు కూడా యివ్వని ప్రాముఖ్యత దూదేకుల సైదులుకు ఇచ్చారు. అతనిని సిద్దునిగా మార్చి, ‘సిద్దా’ అనే మకుటంతో పద్యాలు చెప్పారు. అలాగే కడప, బనగానపల్లె, హైదరాబాదు, కర్నూలు నవాబులకు జ్ఞానబోధ చేసి శిష్యులుగా స్వీకరించారు.