సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం
సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం
ఒకరోజు సిద్ధయ్య వీర బ్రహ్మేంద్రస్వామితో చర్చను ప్రారంభించాడు.
“స్వామీ ఈ సమస్త సృష్టికి కారణభూతుడెవరు?
ఆయనను మనం ఎలా కనుగొంటాం?” అని సిద్ధయ్య ప్రశ్నించాడు.
అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి సిద్ధయ్యకు ఇలా వివరించారు.
''ఈ ప్రపంచంలో మన అనుభూతికి, జ్ఞానానికి అందని ఒక అద్భుత శక్తి వుంది. దానినే సర్వేశ్వరుడు అని మనం పిలుస్తాం. దీనిని వేర్వేరు మతాలకు చెందినవారు వేర్వేరుగా గుర్తిస్తారు. కానీ,ఆ శక్తిమంతుడు ఒక్కడే! అతడే భగవంతుడని ఆస్తికులంటారు.అది మన జ్ఞానానికి అతీతమైన సర్వోన్నత శక్తి అని, పుట్టుక, మరణము లేని శక్తి అనీ నాస్తికులంటారు.దానిని మనం అన్వేషణ ద్వారా కనుగొనవచ్చు''
''మన కళ్ళకు కనిపించే ఈ ప్రపంచము మొత్తము పూర్తిగా కల్పితమైనదే! అంటే ఇది అశాశ్వతమైనది. ఇది నశించక తప్పదు. అయితే, మరి మనకి కనబడుతున్న ఈ జీవులు, జీవం లేని వస్తువులు శాశ్వతం కాదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవించవచ్చు. ఈ శరీరమే అశాశ్వతం. అలాంటప్పుడు మనకి గోచరమయ్యే ఈ చరాచర వస్తువులన్నీ కూడా నాశనమవుతాయి.
జీవుల జ్ఞానానికి, దృష్టికి అందని ఒకే అంశం, తత్త్వం ఈ సృష్టికి ముందు నుంచీ వుంది. ఇప్పుడు కూడా వుంది. తర్వాత కూడా వుంటుంది. దానినే మూల తత్త్వమనీ, భగవంతుడనీ రకరకాల పేర్లతో పిలుస్తాం. కొలుస్తాం. దాని స్వభావాన్ని గ్రహించటం అనేది దాదాపు అసాధ్యం. అది సాధారణ భావనకు అందనిది.
సమస్త సృష్టికీ కారణభూతమే ఈ అంశం. ఇది పరిపూర్ణమైనది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ ఇందులోంచే ఉద్భవించాయి. తిరిగి ఇందులోనే లయమైపోతాయి.శ్రీ కృష్ణుడు తన విశ్వరూపం గురించి చెప్పిన సందర్భంలో కూడా దీని గురించే చెప్పాడు.
ఈ ప్రపంచంలో జీవులు అనుభవించే అనుభూతులకు అతీతమైనది అది. తన కర్మకు తాను నిర్వరిస్తూ పోతుంది. తప్ప ఎవ్వరి అనుజ్ఞ కోసం, ప్రార్థనల కోసమూ ఆగదు. దానిని మనం భగవంతుడని పిలుస్తూ, అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తూ వుంటాం.
భగవంతుడికి లేదా ఈ అనంతత్వానికి ఒక రూపం లేదు. గుణం లేదు. చావు లేదు. పుట్టుక లేదు.అతడు ఆది లేనివాడు.అనంతమైన వాడు. అన్నింటిలోనూ వుంటాడు. అన్నీ తానై వుంటాడు. కానీ ఇందులో ఏ ఒక్కటీ భగవంతుని గురించి లేదా ఈ ఏకత్వం గురించి చెప్పలేదు.
కేవలం మొక్కుబడిగా చేసే పూజలు, చదివే మంత్రాలతో ఎవరూ భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేదు. అలాగే స్వార్థం కోసం చేసే యజ్ఞాలతోనూ మనం భగవంతుని చూడలేం. నిర్మలమైన మనస్సుతో చేసే పనుల వల్ల మాత్రమే, ఎలాంటి యజ్ఞాలు చేయకపోయినా మంత్రాలు చదవకపోయినా భక్తులు సర్వేశ్వరుడిని చూడగలరు.
భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు దైవం తెలీదు. ఈ చర్మ చక్షువులతో భగవంతుని ఎవ్వరూ దర్శించలేరు, గుర్తించలేరు. ఎంతమంది భక్తులున్నప్పటికీ అతి కొద్దిమంది మాత్రమే భగవంతుని చేరుకోగలరు.
ఇక జీవుని గురించి వివరిస్తాను. ఈ శరీరంలో 20 కోట్లకు పైన రోమ రంధ్రములున్నాయి. 70 ఎముకలు, మాంసముతో నిర్మితమయినదే ఈ స్థూల దేహము. ఇది సుఖకరమైన అనుభవాలను అందిస్తున్నట్టు భ్రాంతి కలిగించే దుఃఖస్వరూపం. సామాన్య మానవులే కాదు, యోగులు, ఋషులు కూడా వాంఛల ద్వారా మాత్రమే జీవించే ఈ శరీరం పట్ల, సుఖముల పట్ల, కోర్కెల పట్ల అనుబంధము పెంచుకుని ఎన్నో కష్టాలు పొందారు.
ఆత్మవేరు, శరీరం గుర్తించే నేను వేరు. అనేక కోరికల ఫలితంగా రూపుదిద్దుకునేదే నేను. ఆత్మకు ఈ వాంఛలు వర్తించవు.కేవలం నిమిత్త మాత్రముగా ప్రవర్తిస్తూ, జీవుని నడిపిస్తుంటుంది. దానికి ఇరువది అయిదు తత్త్వాలు, దశ నాడులు, సప్త ధాతువులచే నిర్మితమైన ఈ శరీరంలో ఏడు పుష్పములున్నాయి.
వీనిలో మొట్టమొదటిది మూలాధారం. గుద స్థానము నందు వుండే మూలధార చక్రమునకు విఘ్నేశ్వరుడు అధిదేవత.
రెండవది స్వాథిష్టాన చక్రము. ఆధార చక్రమునకు రెండు అంగుళములపై నాలుగు రేకులు కలిగి,మూడు కోణములతో తెల్లని రంగుతో, ప్రకాశవంతంగా, నిర్మలంగా వుంటుంది. ఇది జల తత్త్వాన్ని కలిగి వుంటుంది. ఈ చక్రమునకు బ్రహ్మదేవుడు అధిదేవత.
మూడవది మణిపూరకము. స్వాధిష్ఠాన చక్రమునకు పైన ఒక మణివలె ప్రకాశిస్తుంటుంది. నీలవర్ణము కలిగింది. మొత్తం పది రేకులతో వుంటుంది. విష్ణువు ఈ చక్రానికి అధిష్టాన దేవత.
అనాహత చక్రము హృదయ స్థానములో పన్నెండు రేకులతో వుంటుంది. స్వర్ణ కాంతులను వెదజల్లుతూంటుంది. ఇది వాయు స్వభావం కలిగి వుంటుందని యోగుల భావన. దీనికి రుద్రుడు అధిష్టాన దేవత.
విశుద్ధ అనేది ఐదవ చక్రము. అనాహిత చక్రమునకు పైన, కంఠములో వుంటుంది. పదహారు దళములుంటాయి.
ఆజ్ఞా చక్రము ఆరవది. విశుద్ధ చక్రము మొదలు 12 అంగుళములపైన భ్రూ మధ్య స్థానంలో (త్రికూట స్థానము) ఉంటుంది. రెండు రేకులు కలిగి వుంటుంది. ఎరుపు, పసుపు రంగులతో అపారమైన కాంతిని వెదజల్లుతుంటుంది. దీనికి ఈశ్వరుడు అధిష్టాన దేవత.
సహస్రాకారము అనునది ఆజ్ఞా చక్రానికి పైన కపాలంలో, బ్రహ్మరంథ్రము వద్ద వుంటుంది. ఎనిమిది దళాలుంటాయి. వేయి రేకులు కలిగి వుంటుంది.
ప్రాణ వాయువునకు కుడి ఎడమ వేపుల ఇడ పింగళులు అనే నాడులు వున్నాయి. ఇడ పింగళులు సహస్రారము మొదలు ఆగ్నేయ చక్రం వరకు వ్యాపించి వుంటాయి. వీటిమధ్య సుషుమ్ననాడి వుంటుంది. ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి వుంటుంది. ఈ నాడుల యందు ప్రవహించే జీవ శక్తి జీవుని చలనంతో ఉంచుతుంది''
ఇప్పుడు మీకు కుండలినీ శక్తి గురించి వివరిస్తాను. కుండలినీ శక్తిని జాగృతం చేయగలిగినవారు ఈ సృష్టిలో ఏదైనా సాధించగలుగుతారు. ఈ సృష్టిలో అతి కొద్ది మందికి మాత్రమే ఇది సాధించే శక్తి వుంటుంది. అది రకరకాల కారణాల వల్ల సాధ్యం కావచ్చు. యోగులు వేలమంది వుండవచ్చు. కానీ కుండలినీశక్తిని జాగృతం చేయగలిగినవారు అతి తక్కువ.
కఠోరమైన సాధన ద్వారా కుండలినీ శక్తిని మేల్కొలపగలుగుతారు. ఇది హఠ యోగం వల్ల సాధ్యపడుతుంది. లేదా మంత్ర జపం వల్ల కూడా సాధ్యమే! మన ఋషులలో ఎక్కువమంది ఈ శక్తిని సాధించనవారే! అందువల్లే వారు భూత భవిష్యత్ కాలాలను గురించి చెప్పగలిగేవారు. వివిధ మహిమలను ప్రదర్శించేవారు.
మన మనస్సు సాధారణ వాంఛల వేపే మొగ్గుతుంది.ఎంతటి సన్యాసి అయినా, యోగి అయినా కొద్ది క్షణాలసేపు అయినా కామ వాంఛలకు లొంగని వాడుండడు. అంతటి చంచలమైన మనస్సుపై అదుపు సాధించి ధ్యానంలో నిమగ్నం చేయటం అనేది అతి కొద్దిమంది సాధకులకే సాధ్యపడుతుంది. వారిలో కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగినవారు చాలా తక్కువ.
హఠయోగం ప్రకారం కుండలినీ శక్తి పీఠం గుదస్థానం మర్మస్థానం మధ్యలో వుంటుంది. స్త్రీలకు యోని స్థానంలో వుంటుంది. ఇది అండం ఆకారంలో వుంటుంది. సర్పం చుట్టలు చుట్టుకుని నిద్రిస్తున్న విధంగా ఈ శక్తి వుంటుంది. ఈ సృష్టిని ఏ శక్తి అయితే శాసిస్తుందో ఆ శక్తి అంశమే కుండలిని. ఈ శక్తిని మేల్కొలిపితే ఆ భౌతికకాయం జీవంతో వున్నంతవరకు శక్తి వుంటుంది. శరీరంలోని నాడులన్నిటినీ మహాశక్తితో నింపుతుంది కుండలిని. మహా శక్తివంతమైన కుండలినీ శక్తిని జాగృతం చేయడమే యోగాభ్యాసంలోని అత్యున్నత స్థితి. మానవ శరీరమే దేవుని నిలయం. మన శరీరంలోనే ఎన్నో అధ్బుతాలున్నాయి. యోగ సాధన ద్వారా మాత్రమే వీటిని మనం దర్శించగలం" అని వివరించారు.
వీరబ్రహ్మంగారు తన శిష్యుడు సిద్దయ్యకి శరీరం గురించి, కుండలినీ శక్తిని గురించి వివరిస్తుండగా, కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా రహాస్యంగా విన్నాడు. అతడు తన అమాయకత్వంతో "బ్రహ్మంగారు చెప్పినదాని బట్టి శరీరం లో చాలా అధ్బుతాలు వున్నాయి. వాటిని నేను చూడాలి” అనుకుని ఇంటికి వెళ్లాడు.
అక్కడ నిద్రిస్తున్న తన భార్య శరీరాన్నికత్తితో నరికివేసి, అందులోతనకు ఏమైనా అద్భుతాలు కనబడతాయేమోనని చూశాడు. కానీ, కక్కయ్యకు రక్త మాంసాదులు తప్ప ఏమీ కనబడలేదు.
'అయ్యో ఆ అయ్యవారు చెప్పిన మాటలు విని నేను, నా భార్యను చంపాను. నాకు దేవుళ్ళు ఎవరూ కనబడకపోగా, పెండ్లాము ప్రాణం తీసిన వాడయ్యాను. దీనికంతటికీ కారణం బ్రహ్మంగారే! ఇదంతా నేను వెళ్లి ఆయననే అడుగుతాను. సమాధానం చెప్పకపోతే ఈ స్వామి దొంగోడు అని అందరికి చెబుతా' - అనుకుని బ్రహ్మంగారి దగ్గరకు వెళ్లాడు. తర్వాత కక్కయ్య బ్రహ్మంగారికి జరిగినదంతా వివరించి, ఆయనను దూషించడం మొదలు పెట్టాడు.
కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపోయారు బ్రహ్మంగారు. తర్వాత "కక్కయ్యా! నేను చెప్పినదేదీ అసత్యం కాదు. నేను అసత్యాలేవి చెప్పను. దానికి ఋజువుగా మరణించిన నీ భార్యను నేను బతికిస్తాను ” అని అభయమిచ్చి అతని వెనుక బయల్దేరారు.
కక్కయ్య ఇంటికి చేరిన తరువాత కక్కయ్య భార్య శరీరంపై మంత్రజలం చల్లారు. ఆశ్చర్యకరంగా ఆమె పునర్జీవితురాలైంది.
ఆ అద్భుతాన్ని చూసి బ్రహ్మానందభరితుడైన కక్కయ్య బ్రహ్మంగారి కాళ్ళమీద పడ్డాడు. “నన్ను క్షమించండి ప్రభూ ! నేను మిమ్ముల్ని తెలుసుకోలేకపోయాను. ఇక ఎప్పటికీ నేను మీ శిష్యుడిగానే వుండిపోతాను” అని ప్రార్థించాడు.
“నా శిష్యులు ఎవ్వరూ నన్ను పూజించకూడదు. వారందరూ ఆ సర్వేర్వరుని కోసం అన్వేషిస్తూ వుండాలి. నువ్వు కూడా అదే విధంగా జీవించు" అని కక్కయ్యను ఆయన ఆదేశించి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయారు.
యధా ప్రకారం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన దేశాటనను కొనసాగించారు. గ్రామాల్లో తిరుగుతూ, ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపటం మొదలుపెట్టాడు.
తన మార్గాంతరంలో నంద్యాల చేరుకున్నారు. ఆ దగ్గరలో వున్నఒక గ్రామంలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. భోజనం చేసే సమయంలో దాహం వేసి, ఆ ఊరిలో వున్నఒక విశ్వబ్రాహ్మణుని యింటికి వెళ్లి, కొద్దిగా మంచినీరు ఇవ్వమని అడిగారు.
ఆ విశ్వబ్రాహ్మణుడు తన పనిలో నిమగ్నమై వున్నందువల్ల, ఇంటిలో ఎవ్వరూ లేనందువల్ల పక్కనే వున్న బావి వద్దకు వెళ్లి నీరు తాగమని చెప్పాడు. కానీ బ్రహ్మంగారు ఆ మాటలను పట్టించుకొనక మళ్ళీ మంచినీరు ఇవ్వమని అడిగారు. దాంతో ఆ విశ్వబ్రాహ్మణుడు కోపం తెచ్చుకుని కొలిమిలో కరుగుతున్న లోహాన్ని మూసతో సహా తీసుకువచ్చి, బ్రహ్మంగారికి ఇచ్చి దాహం తీర్చుకోమని ఎగతాళి చేశాడు. అతని అహంకారమును పోగొట్టాలని నిర్ణయించుకున్న బ్రహ్నంగారు ఆ మూసను చేతితో పట్టుకుని మంచి నీటి వలె తాగేశారు.
ఇది చూసిన ఆ విశ్వబ్రాహ్మణునికి భయం వేసింది. తర్వాత బ్రహ్మంగారు మామూలు మనిషి కాదని గ్రహించుకుని, ఆయన పాదాలపై పడి, తన తప్పును క్షమించమని ప్రార్థించాడు.
ఒక సందర్భంలో బ్రహ్మంగారు, తన శిష్యుడు కక్కయ్యను ఉద్దేశించి, "నాకు ఎవ్వరి మీదా ఆగ్రహం కలగదు. కేవలం అజ్ఞానం మీద తప్ప! ఆ అజ్ఞానాన్ని తొలగించుకుని సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా విజ్ఞానం అంకురిస్తుంది, విచక్షణ పెరుగుతుంది. ఇప్పుడు నేను నీ విషయంలో చేసిందే అదే. కాబట్టి ఇకపై నువ్వు వివేకవంతుడిలా ప్రవర్తించు. జరిగినదాని గురించి మరచిపో " అని జవాబిచ్చాడు.
“నా అజ్ఞానాన్ని తొలగించి, నాకు జ్ఞాన బోధ చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ నేను మీకు శిష్యుడిగానే వుండిపోతాను. మీరు అంగీకరించండి ” అని ప్రార్థించాడు.
అందుకు ఒప్పుకున్న బ్రహ్మంగారు, కక్కయ్యను స్వీకరించి, అతనికి సంతృప్తిని కలిగించారు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి కర్నూలు జిల్లాలోని కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించి, నంద్యాలకు చేరుకున్నారు.
నంద్యాలలో విశ్వబ్రాహ్మణులలో సంపన్నులను 'పాంచాననం 'అని పిలిచేవారు. వీరు చాలా అహంకారంతో ప్రవర్తించేవారు. సహాయం కోరి వచ్చిన వారితోనూ, ఇతరులతోనూ, వయసులో పెద్దవారు అని కూడా చూడకుండా తలబిరుసుతనంతో కించపరుస్తూ మాట్లాడేవారు.
ఒకసారి బ్రహ్మంగారు ఆ ఊరికి వచ్చారు. ఆ ఊరిలోని కొందరు భక్తులు స్వామి వారికి భోజనాది వసతులు కల్పించారు. కానీ,పాంచాననం వారు మాత్రం తమకేమీ పట్టనట్టు వున్నారు.
ఇదంతా గమనించిన బ్రహ్మేంద్రస్వామి తానే వారి వద్దకు వెళ్లి "నాయనలారా నా తప్పేముంది? అతి పేదలమైన మేము క్షుద్భాదని ఓర్వలేక మా ఆకలి తీర్చగలరని మీ వద్దకు వచ్చాము. మాకు భోజన సదుపాయములు కల్పించి మా ఆకలి తీర్చగలవారు మీరొక్కరే అని భావిస్తున్నాను. అందువల్ల మీ దగ్గరికి వచ్చాం" అని పలికారు.
వారిలో ఒక వృద్ధుడు 'తినేందుకు ఎంత అన్నం అవసరం అవుతుందో చెప్పమని 'పరిహాస పూర్వకంగా అన్నాడు.
“మాకు ఎంత అవసరం అవుతుంది నాయనా?! ఏదో మా కడుపు నిండితే చాలు" అని బ్రహ్మంగారు జవాబిచ్చారు.
బ్రహ్మంగారిని ఏదో విధంగా అవమానపరచాలని అనుకున్నవారిలో ఒక వ్యక్తి "అబ్బే... మీరు మరీ అంత తక్కువ తింటే మాకు సంతృప్తి వుండదు స్వామిగారూ! మీరు మా అతిథి. మేం మీ కోసం పుట్టి బియ్యం వండి నైవేద్యం అందిస్తాం. మీరు ఏమీ మిగలకుండా తింటేనే మాకు ఆనందం కలుగుతుంది'' అని ఎగతాళిగా అన్నాడు.
“మీరు అంత అడిగినప్పుడు నేను కాదు అని ఎలా అనగలను నాయనా! అలాగే చేయండి ” అన్నారు బ్రహ్మంగారు.
ఆ విశ్వబ్రాహ్మణులు పుట్టి బియ్యం వండించారు. దానిని ఆరగించమని స్వామి వారిని, శిష్యులను భోజనానికి పిలిచారు.
వీరికి తగిన జవాబివ్వాల్సిందేనని నిశ్చయించుకున్న స్వామివారు తన శిష్యుడయిన సిద్ధయ్యను పిలిచి "ఈ అన్నం మొత్తం నువ్వొక్కడివే స్వీకరించి, మనకు అన్నం దానమిచ్చిన వారిని సంతుష్టులను చేయి" అని ఆజ్ఞాపించారు. తర్వాత ఆ అన్నపు రాశి నుంచి ఒక ముద్దను తీసుకుని పక్కకు నిలబడ్డాడు. గురుదేవుని ఆజ్ఞ ప్రకారం ఆ పుట్టి అన్నాన్ని కూడా వేగంగా ఆరగించేశాడు.
వెంటనే జీర్ణం చేసుకుని, తనకు మరింత అన్నం కావాలని సంజ్ఞ చేశాడు. దీన్ని చూసి నిర్ఘాంతపోయిన ఆ విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారు కావాలని ఈ విధంగా చేశారని గ్రహించారు. వారి శక్తిని గ్రహించి, తమ అహంకారాన్ని, అజ్ఞానాన్నిక్షమించమని కోరారు.
బ్రహ్మంగారు చిరునవ్వు నవ్వి, తన చేతిలో వున్నఅన్నపు ముద్దను సిద్ధయ్యకు తినిపించాడు. అప్పటికి గానీ అతనికి కడుపు నిండలేదు. తర్వాత ఆ విశ్వ బ్రాహ్మణులు స్వామికి పూజలు చేసి, తమకు తత్వోపదేశం చేయమని అభ్యర్థించారు. బ్రహ్మంగారు వారందరికీ జ్ఞానోపదేశం చేశారు.
తర్వాత స్వామివారు అక్కడి నుంచి బయల్దేరి అహోబిలం చేరి అక్కడ వున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ నుంచీ మళ్ళీ బయలుదేరి కడపకు చేరారు. కడప నవాబుకు తమ రాక గురించి తెలిపారు.
వెంటనే నవాబు తన పరివారంతో సహా బ్రహ్మంగారి దగ్గరకు వెళ్లి , ఆయనకు సకల గౌరవ సత్కారాలు చేసి, తమతో పాటు తోడ్కొని వెళ్లాడు.
బ్రహ్మంగారి మహిమలు గురించి విన్ననవాబు, ఏదో విధంగా స్వామి వారి మహిమలను చూడాలని నిర్ణయించుకుని, స్వామి దగ్గరకు వచ్చి, మరుసటి రోజు కచేరీ ముందు వున్న మైదానంలో జరిగే సభకు రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చిరునవ్వుతో "నీ మనస్సులో వున్న కోరిక తెలిసింది.నువ్వు అనుకున్నదానిని నేను చేసి చూపించగలను'' అని చెప్పి పంపించారు.
తన మనస్సులో బ్రహ్మంగారి మహిమను పరీక్షించాలి అనుకున్నట్టు ఈయన ఎలా కనిపెట్టారో అర్థంకాక నవాబు విస్మయంలో మునిగిపోయాడు. తాను ఏర్పాటు చేస్తున్న సభ గురించి అందరికీ తెలిసేలా చాటింపు వేయించాడు నవాబు.
మరుసటి రోజు సాయంత్రం ప్రజలందరూ సభా స్థలం వద్దకు చేరుకున్నారు. వీర బ్రహ్మేంద్రస్వామి తన శిష్యులతో సభకు వచ్చి ఆశీనులయ్యారు. నవాబు లేచి నిలబడి "స్వామీ! నా వద్ద ఒక చూడి గుర్రం వుంది. అది ఆడ గుర్రాన్ని కంటుందో లేక మగ గుర్రాన్ని కంటుందో తెలియజేయండి" అని కోరాడు.
స్వామి చిరునవ్వుతో ఆ గుర్రాన్ని సభకు తీసుకురమ్మని కోరగా , నవాబు స్వామివారి ఎదుటకు గుర్రాన్ని తెప్పించాడు. స్వామి ఆ గుర్రాన్ని చూసి "దీని గర్భంలో నాలుగు తెలుపురంగు కాళ్ళు, నొసట చుక్క, పువ్వుల తోక కలిగిన మగ గుర్రం ఉంది. అలాంటి వింత గుర్రమే జన్మిస్తుంది" అని చెప్పారు.
ఆ మాట విన్న తర్వాత కూడా నవాబుకి వున్న సందేహం దూరం కాలేదు.
వీరబ్రహ్మేంద్రస్వామికి మహిమలు ఉన్నాయో లేదో పరీక్షించాలి అని నవాబు అనుకున్నప్పుడు, నవాబును ఉద్దేశించి "ఆ గుఱ్ఱము గర్భములో వున్న శిశివును చూడటమే నీ ఉద్దేశ్యం అని నాకు అర్థమయింది. అది చూసేవరకూ కూడా నాపై నీకు కలిగిన సందేహం తొలిగిపోదు... అవునా!” అని నవ్వుతూ అడిగారు స్వామి. నవాబు అవునని జవాబిచ్చాడు.
వీరబ్రహ్మంగారు నాలుగువేపులా డేరా కట్టించి, గుఱ్ఱం గర్భంలో వున్నపిల్లను బయటకు తీసి నవాబుకు చూపించారు. నవాబు దాన్ని తన చేతులతో అందుకుని, తెర బయటకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రజలందరికీ చూపించారు.అది బ్రహ్మంగారు వర్ణించినట్టే చిత్రమైన గుర్తులు కలిగి వుంది. అందురూ స్వామివారి శక్తిని కళ్ళారా చూసి, ఆశ్చర్యపోయారు.
తిరిగి బ్రహ్మేంద్రస్వామి ఆ గుఱ్ఱపు పిల్లని గుర్రం గర్భంలో ప్రవేశపెట్టి, గుర్రాన్ని తిరిగి బ్రతికించి నవాబుకు ఇచ్చేశారు. ఈ సంఘటనతో నవాబుకు వీరబ్రహ్మంగారిమీద నమ్మకం పెరిగింది. తన భవిష్యత్తు చెప్పమని ప్రార్థించాడు.