బ్రహ్మంగారి తిరుగు ప్రయాణం - శిష్యుల సంవాదం
బ్రహ్మంగారి తిరుగు ప్రయాణం - శిష్యుల సంవాదం
హైదరాబాద్ లో కొద్దికాలం గడిపిన బ్రహ్మంగారు తిరిగి తన ఊరికి రావాలని నిర్ణయించుకున్నాడు.
బ్రహ్మంగారికి సిద్దయ్య అనే వ్యక్తీ అభిమాన శిష్యుడిగా మారాడు.ఇది మిగిలిన శిష్యులకు కొద్దిగా కోపాన్ని కలిగించింది. బ్రహ్మంగారు కూడా సిద్ధయ్య మీద ఎక్కువ అభిమానాన్ని ప్రదర్శించేవారు. శిష్యుల్లో సిద్ధయ్య మీదా ఏర్పడిన భావాన్ని తొలగించాలని నిర్ణయించుకున్న బ్రహ్మంగారు అందుకు తగిన సమయం కోసం ఎదురుచూడటం మొదలు పెట్టారు.
హైదరాబాద్ నుంచి కడపకు పయనం సాగించారు బ్రహ్మంగారు, ఆయన శిష్య బృందం. ఆ మార్గ మధ్యలో స్వామివారు ఒక కుక్క కళేబరాన్ని సృష్టించారు.అది జీర్ణదశలో పురుగులతో నిండి,అతి దుర్గంధాన్ని వెదజల్లుతోంది. అందరూ అ దుర్గంధాన్నిభరించలేకపోయారు. బ్రహ్మంగారు ఆ కుక్క శరీరం వేపు నడవటం మొదలుపెట్టారు. ఆ కుక్క శరీరం నుంచి వస్తున్న దుర్గంధం భరించలేక, మిగిలిన శిష్యులందరూ కొంచెం వెనకగా నడవటం ప్రారంభించారు.అయితే, సిద్ధయ్య ఒక్కడూ మాత్రం వేరే ఎటువంటి ఆలోచన లేక, గురువునే అనుసరిస్తూ వచ్చాడు.
అందరూ ఆ కుక్క మృతదేహాన్ని సమీపించారు. వీరబ్రహ్మేంద్రస్వామి అక్కడ నిలబడి, శిష్యులను కూడా ఆగమని చెప్పారు. అప్పుడాయన తన శిష్యులతో - "మీరందరూ పెద్ద కులంవారమనీ సిద్ధయ్య కంటే తెలివితేటలు ఎక్కువగా వున్నాయనీ అనుకోవటం నేను గ్రహించాను. మీకు నిజంగా నేనంటే గురు భక్తి వుంటే, ఈ శుకనాన్ని తినండి.. అప్పుడే నేను మిమ్ముల్నినా నిజమైనా శిష్యులుగా గుర్తిస్తాను"అన్నారు.
ఆ మాట వినటంతోటే శిశ్యులందరూ నిర్ఘాంతపోయారు.
'దూరంగా నిలబడే, కుక్క శరీరం నుంచి వస్తున్న వాసనను భరించలేని తాము మాంసాన్ని ఎలా తినగలం ' అని ఆలోచించడం మొదలుపెట్టారు. అది గ్రహించిన బ్రహ్మంగారు సిద్దయ్యను, శునక మాంసాన్ని తినమని ఆదేశించారు. సిద్ధయ్య గురువుగారైన వీరబ్రహ్మేంద్రస్వామి మీద ఉన్న నమ్మకంతో క్షణం కూడా ఆలోచించకుండా ఆ మాంసాన్ని స్వీకరించాడు.
అప్పుడు స్వామి వారు శిష్యులవైపు తిరిగి "ఇప్పటికైనా సిద్ధయ్యకు గురువు అంటే ఎంత అభిమానము, గౌరవమో ఉన్నాయో తెలిసిందా?! నన్ను త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు. అహర్నిశలూ నా మాటమీద విశ్వాసము, గౌరవము ఉంచుతాడు. నేను ఏమని ఆజ్ఞాపించినా, దాన్ని నేరవేర్చే దృఢ సంకర్పం కలిగిఉంటాడు. అందుకే సిద్దయ్య అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ,అభిమానం. ఎవరైతే నన్ను అభిమానంతో కొలుస్తారో వారిని నేను గుర్తిస్తాను.వారే నా ప్రేమకు పాత్రులవుతారు ” అని చెప్పారు.
వీరబ్రహ్మేంద్రస్వామి అలా చెప్పడంతో శిష్యులందరూ తమ తప్పు తెలుసుకున్నారు. పశ్చాత్తాపం చెందారు.
''గురువుగారూ, మా తప్పులను క్షమించండి.మేం మీకు శిష్యులుగా వున్నప్పటికీ కులం,అహంకారం,గర్వం వంటి వాటిని దూరంగా తరిమివేయలేకపోయాము. ఆ కారణం వల్లే సిద్దయ్యపట్ల చులకన భావంతో తక్కువగా చూస్తున్నాము. మీ భోధనల వల్ల మా మనసులో పేరుకుపోయిన అంధకారం మాయమైంది ” అంటూ వినయంగా చెప్పారు.
వీరబ్రహ్మేంద్రస్వామి తన శిష్యులను పరీక్షించ దలచి, కుక్క మాంసం తినమని ఆజ్ఞాపించిన సందర్భంలో, వాళ్ళు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందారు. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి “ఇప్పటికైనా మీరు నిజం గ్రహించారు. ఎవరయితే నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతారో, సేవిస్తారో, వారిమీద నేను ఎక్కువగా కరుణ చూపుతాను. దీనికి మీరు చేయవలసింది స్వార్థం వదిలివేయటమే !” అన్నారు.
ఈ సంఘటనతో సిద్దయ్య మాదిరిగా బ్రహ్మంగారి మిగిలిన శిష్యులందరూ కూడా స్వార్థ రహితంగా స్వామిగారిని సేవించడం మొదలు పెట్టారు. అనంతరం స్వామి ఆయన శిష్య బృందం తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ఒకరోజున మొత్తం ప్రయాణించిన తర్వాత బాగా అలసిపోవడంతో ఒక ప్రదేశంలో ఆగారు. అక్కడ విశ్రమించిన సమయంలో స్వామివారు తన శిష్యులతో ఆధ్మాత్మిక సంబంధమైన సంభాషణలు ప్రారంభించారు.
అలా కాలం గడుస్తుండగా బ్రహ్మంగారు హఠాత్తుగా తన శిష్యులలో ఒకరైన వెంకటయ్య వేపు తిరిగి "మరి కొద్ది సమయానికి ఒక అద్భుతం జరగబోతోంది ” అని తెలియజేశారు.
ఆ తర్వాత మళ్ళీ తన శిష్యులతో సంభాషణలో మునిగిపోయారు.
స్వామి వారు సిద్ధయ్యతో మాట్లాడుతూ వుండగా దగ్గరలో వున్న ఒక ప్రదేశం నుంచి ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు వినబడ్డాయి. అలా కొంతసేపు మాటలు వినిపించిన తర్వాత మళ్ళీ నిశ్శబ్దం...తర్వాత మళ్ళీ మాటలు వినబడ్డాయి.
అది గ్రహించిన స్వామివారు శిష్యుడు సిద్ధయ్యడు, ఇతర శిష్యులతో "వారెవరో తెలుసుకుందాం పదండి ” అని అందరినీ తన వెంట తీసుకుని అక్కడికి బయలుదేరి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా, ఒక బ్రాహ్మణ స్త్రీ,కుష్టు రోగియైన తన భర్తను, తన ఒడిలో వుంచుకుని విలపించడం కనిపించింది.
అప్పుడు బ్రహ్మంగారు "ఏమమ్మా...మీరు ఎక్కడినుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? నీ భర్తకు ఈ వ్యాధి ఎలా వచ్చింది? మీ వివరాలన్నీ చెప్పండి ” అన్నారు.
ఆ బ్రాహ్మణ స్త్రీ చెప్పినవన్నీ విన్నతర్వాత -
బ్రహ్మంగారు "ఇక మీ కష్టాలన్నీ పోయినట్టీ. మీ గత జన్మ పాపం వల్లే ఈ వ్యాధి మీకు వచ్చింది. మిమ్ముల్నినేను ఆ పాపం నుంచి విముక్తి చేస్తాను" అని అభయమిచ్చారు. తర్వాత బ్రాహ్మణ యువకుని ఒక్కసారి తన చేతితో తడిమారు.
అంతే... ఆ బ్రాహ్మణుని కుష్టువ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత బ్రహ్మంగారు ఆ దంపతులకు పంచాక్షరి మంత్రం ఉపదేశించారు.
“స్వామీ, మీరు చేసిన ఉపకారం మేం ఎప్పటికీ మరిచిపోలేము. మీరు మా ఊరికి మాతోపాటు రావాలి. మా ఊరి వాళ్ళందరికీ మీ ఉపదేశాలతో జ్ఞానాన్ని కలగచేయాలి ” అని ప్రార్థించారు.
“ఇప్పుడు నేను పర్యటనలో వున్నాను. తగిన సమయం వచ్చినప్పుడు మీరు పిలవకుండానే మీ ఊరికి వస్తాను" అని బదులిచ్చి వారిని పంపివేశారు. తనశిష్యులతోపాటు కందిమల్లాపాలెం జేరి తమ పనులలో నిమగ్నమయ్యారు బ్రహ్మంగారు.