పుష్పగిరి వాసులకు చెప్పిన కాలజ్ఞానం
పుష్పగిరి వాసులకు చెప్పిన కాలజ్ఞానం
నేను శ్రీ వీరభోగవసంతరాయలుగా, కలియుగంలో 5000సంవత్సరంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థం భూమిపై అవతరిస్తాను.
మార్గశిర మాసంలో దక్షిణభాగంలో ధూమకేతువనే నక్షత్రం ఉదయిస్తుంది. మీ అందరికీ కన్పిస్తుంది. క్రోథి నామ సంవత్సరమున, మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో శ్రీ వీర భోగ వసంతరాయలుగా వచ్చే సమయంలో దక్షిణాన నక్షత్రము ఒకటి పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి''
నాలుగు వర్ణాలవారు మద్యపానం చేత భ్రష్టులై పోతారు.
వేదములు అంత్య జాతుల పాలవుతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్తుల పంచన చేరతారు. విధవా వివాహాలు జరుగుతాయి. విప్రులు స్వ ధర్మాలు మాని ఇతర వృత్తులు చేపడతారు. బానిసత్వం చేస్తారు.
బ్రాహ్మణులను పిలిచేవారు వుండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంట భూములు అమ్ముతారు. నేను తిరిగి అవతరించేసరికి బ్రాహ్మణులకు తినేందుకు తిండి, గుడ్డ కరువవుతాయి.
మీన రాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీర భోగ వసంత రాయలుగా ఉద్భవిస్తాను. నాలుగు మూరల ఖడ్గము పట్టి శ్రీశైల పర్వతం మీదికి వచ్చి, అక్కడి ధనమంతా పుణ్యాత్ములయిన వారికి పంచి ఇస్తాను.
నేను తిరిగి భూమి మీదకు ఎలా వస్తానో వివరిస్తాను - వినండి
కేదారివనంలో నిరాహారినై తపం చేస్తాను.మూడు వరాలు పొంది, అచ్చటి నుండి విక్రమ నామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి,బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసి అక్కడ మహా మునుల, మహార్షుల దర్శనము చేసుకుంటాను.
అక్కడినుండి బయలుదేరి, శ్రీశైలం మల్లిఖార్జునుని సేవిస్తాను. అనంతరం దత్తాత్రేయుల వారిని దర్శించుకుంటాను.
మహానందిలో రెండు నెలలుండి, అక్కడి నుంచి శ్రావణ శుద్ధ పౌర్ణమి నాటికి వీరనారాయణపురం చేరుకుంటాను. అక్కడ కొంతకాలం నివసిస్తాను. నేను తిరిగి వచ్చేసరికి జనులు ధన మదాంధులుగా మారి అజ్ఞానంతో కొట్టుకుచస్తారు.
నా రాకకు ముందు సముద్రములోని జీవరాశులన్నీనశిస్తాయి. పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండ పగులకొడతారు.
కాశీదేశములో కలహాలు చెలరేగుతాయి.
మున్ముందు విధవా వివాహాలు విస్తృతంగా జరుగుతాయి. అవి సర్వసాధారణం అయిపోతాయి.
వావీ వరుసలు లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. పార్వతి అవతారములను డబ్బులకు అమ్ముతారు. కులగోత్రములు, నీతి జాతి లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి.
భూమ్మీద ధనరాశులు ముక్కుటంగా ఉంటాయి. చివరికి అరణ్యాలల్లోనూ, అమితమైన ధనముంటుంది. నేను భూమిపై పెక్కు దుష్టాంతాలను పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమి మీద మంటలు పుడతాయి.
నాలుగు సముద్రాల మధ్యనున్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. నూట ఇరవై పుణ్యక్షేత్రములు నశించిపోయేను.
నా రాకకు ముందు అనేక చిత్రములు కలిగేను. శృంగేరి, పుష్పగిరి పీఠములు పాంచాననం వారి పాలవుతాయి.
ఉత్తర దేశంలోకత్తులు తెగుతాయి. తూర్పుదేశం ధూళి అయిపోతుంది.
హరిద్వారంలోని మఱ్ఱి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం వాకిలి మూసి వుంటుంది.
అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజిపువ్వులు పూస్తాయి.
నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది.
వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి సూర్య మండలం నుండి కొలువుపాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలము, తర్వాత సూర్యనంది చేరుకుంటాను.
శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4999నాటికి కలిరూపం కొంత నాశనమవుతుంది.
కలికి అవతారం కలియుగాంతాన వస్తుంది. పూర్వులు గ్రంథములలో కలియుగము, కలికి అవతారం వివరించారు వ్యాసభగవానుడు. శాంతి పర్వం చివరన ఈ అవతారం గూర్చి చెప్పారు.
శ్రీశైలాన పొగ మంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ 'గణగణ ' మువ్వల మోత వినబడుతుంది.
భ్రమరాంబ దేవాలయంలో ఒక మొసలి 7రోజులపాటు కనిపించి, ఆపైన అదృశ్యమవుతుంది.
భ్రమరాంబ మెడలోని మంగళసూత్రం తెగిపడిపోతుంది. ఆమె కంట నీరు కారుతుంది. స్తనాలనుంచి పాలు కారతాయి.
కందనూరి గోపాలుని గుడి ముందు చింతచెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయమున రెండు పాములు తిరుగుతాయి. వాటిల్లో పెద్ద పాము శిఖరాన మూడు రోజులుండి తరువాత అదృశ్యమవుతుంది.
సూర్యనందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలు పూచి, కాయలు కాచి, పండ్లు పండి వెను వెంటనే మాయమవుతుంది.
శిరువెళ్ళ నరసింహుని గుడి ముందర గంగరావి చెట్టు మొలుస్తుంది. బహు ధాన్య నామ సంవత్సరం, వైశాఖ శుద్ధ తదియ, శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు.
బసవన్న రంకె వేస్తాడు. తిరువళ్ళువరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపిస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమటలు పుడతాయి. ఆమె కంట నీరు స్తనాల పాలు కారతాయి.
శాలివాహనశకంలో 1541న ధూమకేతువు పుడుతుంది. శాలివాహన శకం 1555 నాటికి వివిధ దేశాల్లో జననష్టం జరుగుతుంది.
పెమ్మసాని తిమ్మనాయుడు వంశం నిర్వంశమయ్యేను. ఉదయగిరి, నెల్లూరులు రూపుమాసి పోయేను. గండిపేట, గోలకొండ, ఆదలేని, కందనూరి పట్టణాలు నశించి తురకలు పారిపోతారు. విజయపురంలాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశించెను.
స్త్రీల కన్నుల నుండి నెత్తుటి బిందువులు రాలతాయి. వడగండ్ల వానలు, బాణ వర్షాలు కురిసెను. చెరువులు, బావులు, నదుల నీరు ఇంకిపోతాయి. అయినా జుర్రేరు నీరు ఇంకదు.
వీర బ్రహ్మేంద్ర స్వామి పుష్పగిరి నుండి వచ్చే మార్గమధ్యంలో ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో సిద్దయ్య, స్వామివారి పాదాలు ఒత్తుతూ తనకు జ్ఞానబోధ చేయమని కోరాడు.
దానికి అంగీకరించిన బ్రహ్మేంద్రస్వామి అమూల్యమైన విషయాలను ప్రసంగించడం మొదలుపెట్టారు. “సిద్ధయ్యా, విను, జ్ఞానేంద్రియాలు అయిదు, కర్మేంద్రియాలు అయిదు, ప్రాణాలు ఐదు. ఇవి అన్నీ కలిసి 24 తత్వములవుతాయి. . ధవళ, శ్యామల, రక్త, శ్వేత వర్ణముల మధ్య ప్రకాశించేది ‘ప్రకృతి’. అదే ‘క్షేత్రము’. అదే సర్వసాక్షి అయిన సచ్చిదానంద స్వరూపం.. ధవళ, శ్యామల, రక్త, పీత వర్ణాలలో రక్తవర్ణమే స్థూల శరీరం. శ్వేతవర్ణమే సూక్ష్మదేహం.. శ్యామలవర్ణమే కారణ శరీరం. వీటి నడుమ ప్రకాశించే పీత వర్ణమే మహా కారణ దేహము. ఈ కాయమూలా ప్రమాణం గురించి వివరిస్తాను విను...
''స్థూలకాయము ఒకటిన్నర అంగుళాల వ్యాసము గలది. కాయమూలము అంగుళముపైన వుంటుంది. వీటిని మించి ప్రకాశిస్తూ, వుండేదే ఆత్మ. అదే చైతన్యం. ఇవన్నియూ నేత్రములకు కనిపించేవే! నీకు అవి గోచరమయ్యే విధంగా నేను నా శక్తిని వినియోగిస్తాను’’ అని చెప్పి, సిద్ధయ్యకు వాటిని దర్శింపచేశారు స్వామి దాంతో సిద్దయ్య సంతృప్తి పడ్డాడు.