గోవిందమ్మకు జ్ఞాన బోధ
గోవిందమ్మకు జ్ఞాన బోధ
వైశాఖ శుద్ధ దశమి, ఆదివారం అభిజిత్ లగ్నం మధ్యాహ్నం రెండున్నర గంటలకు శుభ సమయమైనందున తాను సమాధి పొందగలనని వీరబ్రహ్మంగారు ప్రకటించారు.
గోవిందమ్మ విలపించటం ప్రారంభించారు. అప్పుడు గోవిందమ్మను ఉద్దేశించి బ్రహ్మంగారు “నాకు మరణం లేదు, నీకు వైధవ్యం లేదు. నీవు సుమంగళిగా జీవించు. సమాధిని చీల్చుకుని నేను వీరభోగ వసంతరాయులనై భూమి మీద అవతరిస్తాను. నా ధర్మ పాలనతో భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను తిరిగి అవతరించే వరకు ఏమేం జరుగుతాయో నీకు క్రమక్రమంగా వివరిస్తాను’’ అంటూ కాలజ్ఞాన బోధ మొదలుపెట్టారు.
“బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది.
మహాలక్షమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది.
కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కు పోగు తాకుతుంది.
కంచికామాక్షి నేత్రాల కన్నీరు ఒలుకుతుంది.
కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది.
బనగాపల్లెలో నా ప్రథమ భక్తురాలు అచ్చమ్మవంశము సర్వనాశనమై, వారి వంశం అంతరించిపోతుంది. నారాయణమ్మ వంశస్తులే మఠాధిపతులవుతారు. నువ్వు ఇకనైనా ఈ భ్రాంతిని విడిచిపెట్టు’’ అని చెప్పి గోవిందమ్మ దుఃఖాన్ని పోగొట్టారు.