కాలజ్ఞానంలో చెప్పినవి - ఇప్పటివరకు జరిగినవి
కాలజ్ఞానంలో చెప్పినవి - ఇప్పటివరకు జరిగినవి
కాశీ పట్న దేవాలయం నలభై రోజులు పాడుపడుతుంది అని భవిష్య వాణి చెప్పాడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. అది ఎలా నిజమయిందో చూద్దాం. 1910 – 12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు.
ఒక అంబ పదారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది.... ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలపాటు మన దేశానికి ప్రధానిమంత్రిగా వున్నారు. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి విస్తృతంగా వస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంతకంటే ముందు సినిమా నటి. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సినీ రంగం నుంచి వచ్చినవారే! చిరంజీవి, విజయశాంతి, జమున- ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది తెరమీది నటులు రాజకీయాల్లో ప్రవేశించారు..
రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంతో రాచరిక వ్యవస్థ లేదు. ఆఖరికి జమీందారీ వ్యవస్థ కూడా నశించింది. ఉన్నదల్లా ప్రభుత్వము, మంత్రులూను. ఈ మంత్రులు వారసత్వం లాగా రారు. నిరంకుశత్వం ఉండదు. ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే అధికారంలోకి వస్తారు. కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన మాట అక్షరాలా నిజమైంది.
ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేకమంది మరణిస్తారు ఆకాశంలో పక్షి వాహనాలు నడుస్తాయని పోతులూరి చెప్పేనాటికి అసలు విమానమే పుట్టలేదు. పుష్పకవిమానం అంటూ పురాణ కధలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతం తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విమాన ప్రమాదాల్లో ఎంతోమంది మరణిస్తున్నారు.
జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. ఒక్క భారతదేశ జనాభానే . వందకోట్లు దాటడం మితిమీరిన జనాభా పెరుగుదలకు నిదర్శనం. భవిష్యత్ లో అన్ని రకాల సమస్యలూ అధిక జనాభా గురించే మొదలవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటివారికి తెలియదు కానీ, వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు వుండేవి. ప్రస్తుతం ఎక్కాడా అగ్రహారాలు లేవు.
హైదరాబాద్ లో తురకలు, హిందువులు పరస్పరం కిరాతకంగా చంపుకుంటారు.... పదిహేనేళ్ళ కిందటి వరకు కూడా హైదరాబాద్ లో మత కల్లోలాలు - అది కూడా కేవలం ముస్లిం, హిందువుల మధ్య మాత్రమే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక హుండీలో చోరీలు చాలా ఎక్కువగా వున్నాయి.
చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ, చావు పుట్టుకలు మాత్రం కనుగోనలేకపోతారు. సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అన్ని రంగాల్లాగే వైద్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. కాలు విరిగేతే రాడ్ వేస్తున్నారు. అసలు కాలే లేకుంటే కృత్రిమ కాలు పెడుతున్నారు. గుండె మార్పిడి దగ్గర్నించీ ఎన్నో అపురూపమైన శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి సాధించిన మాట నిజమే కానీ, చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకూ కనుక్కోలేదు. బహుశా, భవిష్యత్ లో కనుగొనగలరనే నమ్మకం కూడా లేదు.
రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టేను రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. చివరకి ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలిగొన్న విషయం తెలిసిందే. ఎల్.టీ.టీ.ఈ. ప్రభాకరన్ హతుడైన సందర్భంలో ఇరుపక్షాలవారూ మృత్యువాతపడ్డారు.
వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన కొన్ని జోస్యాలు కొద్దిగా అస్పష్టంగా వుండటం వల్ల, వీటిని అనుసరించి ఖచ్చితంగా ఏ సంఘటనలు ఎక్కడ జరుగుతాయో ఊహించటం అంత సులభం కాదు.
ఉదాహరణకు - బ్రహ్మంగారు చెప్పినది - ''ఆకాశమున రెండు బంగారు హంసలు వచ్చి పురములందు, వనములందు, నదులయందు సంచరించెను. ప్రజలు వానిని పట్టుటకు పోయి కన్నులు గానక గిర గిర తిరిగి లక్షోపలక్షలుగా చచ్చేరు...'' వీటికి ఇక్కడ స్పష్టమైన అర్థం లేదు. పేర్లు, వివరాలు లేవు. బంగారు హంసలు అంటే అణుబాంబులు కావచ్చు. అణు బాంబులు పేలినప్పుడు విపరీతమైన మంటలు వస్తాయి. ఇవి పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరయినా మరణించటం ఖాయం.
అలా కాకుండా ఉల్కల గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. గతంలో ఆకాశం నుంచి భూమిమీద పడిన ఉల్కల వల్ల జీవజాతులు నశించిపోయాయి. ఉల్కలు భూ కక్ష్యలోకి ప్రవేశిస్తే ఆ రాపిడికి మంటలు రేగుతాయి. ఈ ఉల్కాపాతం జరిగినా పెను విద్వంసం తప్పదు. వీటిని కూడా బంగారు హంసలు అని అన్వయించుకునే అవకాశం వుంది.
అణుబాంబులు, ఉల్కలు కాకుండా యు.ఐ.ఓ.లు (అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్) కావచ్చు. ఇవి భవిష్యత్ లో భూమిమీదకు వస్తాయా? వీటివల్ల ప్రజలు మరణిస్తారా? పై ప్రశ్నలకు జవాబులు మనకు దొరకటం చాలా కష్టం.
వీరబ్రహ్మేంద్రస్వామి ''మన దేశానికి ఒక స్త్రీ ప్రధానమంత్రి అవుతుందని'' చెప్పిన విధంగానే, ప్రపంచ భవిష్యత్ గురించి చెప్పిన నోస్ట్రడామస్ కూడా ఆ విషయాన్ని చెప్పాడు.
నోస్ట్రడామస్ ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్. ఈయన క్రీ.శ. 1500లోనే చెప్పాడు అంటారు. గాంధీవంశంలో హత్యలు జరుగుతాయని, నోస్ట్రడామస్ తన 'క్వార్టైన్స్' లో చెప్పాడు. ఇవి ఫ్రెంచ్ భాషలో వుంటాయి.
''అయిదు నదుల సంగమ స్థానం నుంచి తలకు పాగాతో వున్న ఒక సాధూజీ భారతదేశానికి ప్రధాని అవుతాడని'' నోస్ట్రడామస్ వివరించాడు. బహుశా ఈయనే మన్మోహన్ సింగ్ అనుకోవచ్చు! ఈయన అధికారంలో వున్నప్పుడు సైనికపరంగా భారతదేశం ప్రపంచంలో బలమైన దేశంగా మారుతుందని ఆ జోష్యంలో వుంది. అది ఒకరకంగా నిజమే కదా! అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు ఆర్ధిక సంక్షోభంలో పుట్టాయి. ప్రస్తుతం మనదేశం పురోగామలోనే ఉంది.
ఇక్కడ నోస్ట్రడామస్ గురించి కొద్దిగా తెలుసుకోవటం అవసరం. తెలుగులో వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ విధంగా అయితే వందల సంవత్సరాల ముందు జరగబోయే విషయాలను దర్శించి చెప్పారో అలాగే నోస్ట్రడామస్ ఫ్రెంచ్ భాషలో చెప్పారు. నోస్ట్రడామస్ జీవితం చాలా ఆశ్చర్యకరంగా వుంటుంది. కాబట్టి అప్పట్లో వున్న మూఢ విశ్వాసాల ప్రాతిపదికగా ఆయన జోస్యం చెప్పాడనే ప్రశ్నకు జవాబు లేదు.
నోస్ట్రడామస్ 1503లో ఫ్రాన్స్ లో జన్మించారు. ఆయన తల్లితండ్రులు యూదులు, చిన్నప్పటి నుంచీ ఆయన వివిధ శాస్త్రాలను నేర్చుకున్నారు. తర్వాత వైద్యంలో గ్రాడ్యుయేషన్ పొందారు. తన జీవిత దశలో అంటే 1564లో కింగ్ ఛార్లెస్ - 9 కు రాజ వైద్యునిగా నియమితులయ్యారు. దీన్ని బట్టే ఆయన ఎంత మేధావో అర్థం చేసుకోవచ్చు.
నోస్ట్రడామస్ జీవిత చివరిదశలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. నోస్ట్రడామస్ అప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 1566జూలై ఒకటవ తేదీన, నోస్ట్రడామస్ చివరి జోష్యాన్ని తన వద్దకు వచ్చిన మత గురువుకు వివరించారు. ఆ గురువు వెళ్ళిపోతూ 'మనం రేపు కలుసుకుందాం' అన్నాడు. దానికి జవాబుగా నోస్ట్రడామస్ 'రేపు సూర్యోదయానికి నన్ను ప్రాణాలతో చూడలేరు' అని పలికాడు. ఆరోజు రాత్రే నోస్ట్రడామస్ మరణించారు.
నోస్ట్రడామస్ చెప్పినవి కూడా బ్రహ్మంగారు చెప్పిన విధంగానే కొద్దిగా అస్పష్టంగా, విశేషణాలతో, వర్ణనలతో కూడి వుంటాయి. ఖచ్చితత్వం తక్కువ. సంవత్సరాలు, దేశాల పేర్లు ఎక్కువగా వుండవు. నాలుగు వాక్యాలతో ఫ్రెంచ్ భాషలో వున్న వీటినే 'క్వార్ట్టైన్స్' అంటారు.
నోస్ట్రడామస్ చెప్పినది - '45డిగ్రీల కోణంలో ఆకాశంలో మంటలు చెలరేగుతాయి కొత్త నగరం వైపు ఆ మంటలు ప్రయాణం చేస్తాయి' ఇక్కడ నగరం పేరు లేదు. అది ఏ దేశంలో వుంటుందో, మంటలు ఎలా పుడతాయో చెప్పలేదు. ఎంతకాలం అవి విధ్వంసాన్ని సృష్టిస్తాయో కూడా లేదు. దీనివల్ల ఈ జ్యోతిష్యాన్ని ఎవరికి వారు తమ విజ్ఞానాన్ని బట్టి అన్వయించుకున్నారు.
డామ 'కొత్తనగరం' అంటే న్యూయార్క్ అని పశ్చిమ దేశీయులు భావిస్తున్నారు. ఇది మూడో ప్రపంచ యుద్ధ సమయంలో సంఘటన అని కొందరి అంచనా.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన జోస్యాల్లో ఎన్నో నిజమయ్యాయి.
ఉదాహరణకు..
గట్టివాడయిన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు ..
ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడయిన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమయిన పాలనను అందించారు.
కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. .
వీరివల్ల ప్రజలందరూ మోసపోతారు.. ప్రస్తుతం గాల్లోంచి ఏవేవో వస్తువులు సృష్టించి ప్రజలను మోసం చేసే బాబాలు, కపట సన్యాసులు పెరిగిపోయారు. వీరికి ఏ మహిమలూ లేకపోయినా ప్రజలు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. పైగా ఈ దొంగ స్వాములు భోగవిలాసాలకు బానిసలుగా ఉన్నారు. ఎందరో దొంగ సన్యాసుల గుట్టు రట్టవుతోంది.
దొంగ స్వాముల వల్ల నిజమైన యోగులకు చెడ్డ పేరు వస్తోంది. ఈ విషయం గురించి వీరబ్రహ్మేంద్రస్వామి 500 ఏళ్ళ కిందటే వివరించారు. ఈ విషయమొక్కటే చాలు వీరబ్రహ్మేంద్రస్వామి ఇప్పటి బాబాలు, నకిలీ యోగుల మాదిరిగా పేరు కోసం, డబ్బు కోసం, ఇతర సుఖాల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని రుజువు చేసేందుకు. అంతే కాకుండా నిజాలు తెలుసుకోకుండా యోగులందరూ దొంగలే అని వాదించే కొందరికి ఇది కనువిప్పు కలిగిస్తుంది.
కాలజ్ఞానంలో ఇలాంటి అంశాలు కోకొల్లలు. వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన అన్ని విషయాలూ తెలుసుకోవాలంటే కాలజ్ఞానం చదవాలి.