కాలజ్ఞాన రచన
కాలజ్ఞాన రచన
వీరబ్రహ్మేంద్రస్వామికి వీరం భోట్లయ్య అనే పేరు కూడా ఉంది. ఈయన తండ్రి పేరు వీర భోజ్య రాయలు, తల్లి వీర పాపమాంబ. 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీరబ్రహ్మేంద్రస్వామికి అపారమైన విజ్ఞానం ఏర్పడింది. ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరులతో తక్కువగా మాట్లాడుతుండేవాడు.
అద్భుత తత్వవేత్త ఆది శంకరాచార్యుల వలెనె వీర బ్రహ్మేంద్రస్వామి కూడా వివిధ విషయాలపై తాను జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా ఇతరులకు చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. తండ్రి మరణించిన కొద్దికాలం తర్వాత తన తల్లిని వదిలి వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు నిర్ణయించుకుని తల్లి అనుమతి కోరాడు.
తల్లి పుత్రా ప్రేమవల్ల దీనికి అభ్యంతరం చెప్పింది. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి తల్లికి వివిధ రకాల విషయాల గురించి జ్ఞానాన్ని అందజేశాడు.
అశాశ్వతమైన ఈ దేహం కోసం, బంధాలు, అనుబంధాల కోసం ప్రతి క్షణం తపించడం వృధా ప్రయాస అని తెలియచెప్పాడు. శరీర తత్వం ఎలా ఉంటుంది ? ఈ భౌతిక శరీరం ఆకాశం, గాలి, అగ్ని, నీరు, పృథ్వి అనే అయిదు అంశాలతో రూపొందుతుందని తల్లికి వివరించాడు వీరబ్రహ్మేంద్రస్వామి. వేదాల్లోనూ ఇదే ఉంది.
పంచభూతాల కలయికతోనే ''నేను'' అనే భావన ఏర్పడుతుంది. ఈ సమస్త చరాచర ప్రకృతిని అర్ధం చేసుకునేందుకు మనకు చెవి, కన్ను, ముక్కు వంటి జ్ఞానేంద్రియాల వల్ల సాధ్యమౌతుంది. వీటి ద్వారా వివిధ రకాల పద్ధతులు, మార్గాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. అయితే వీటన్నిటినీ సమగ్రంగా అర్ధం చేసుకోడానికి ఉపయోగపడే తత్వమే నేను లేదా అహం. మనం సంపాదించే విషయ పరిజ్ఞానాన్ని మొత్తాన్ని మన మేధస్సు కు ఆర్దమవడానికి కారణం తత్వమే.
ఈ పంచాంశాల వల్ల కామ, క్రోధ, మోహాలు కలుగుతాయి.ఇవి ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు ఆ జీవుడు లేదా బుద్ధి ఆ దిశగా చలిస్తూ ఉంటుంది. ఆత్మ అనేది నిమిత్తమాత్రంగా ఉంటూ అన్నిటినీ గమనిస్తూ ఉంటుంది.ఏది మంచిదో, ఏది చెడ్డదో చెప్పడం వరకే దాని బాధ్యత. అంతే కానీ తప్పనిసరిగా 'నువ్వు ఈ దిశలో వెళ్ళు' అని ఆదేశించదు. ఆ విషయం బుద్ధి అధీనంలో ఉంటుంది. బుద్ధి, కర్మ అధీనంలో ప్రవర్తిస్తుంది. అందుకే ''బుద్ధీ కర్మానుసారిణీ'' అని పెద్దలు చెప్తారు.
భౌతికంగా ఎంతటి గోప్పవాడయినా కర్మ నుండి తప్పించుకోలేదు. శ్రీకృష్ణుడు అంతటి మహాయోగి చివరికి ఒక బోయవాని బాణపు దెబ్బకు అడవిలో మరణించాడు. ఈ విషయాన్ని ఎవరు గ్రహిస్తారో, పరబ్రహ్మను ఎవరు ధ్యానిస్తారో వార్కికి దుఃఖం తగ్గుతుంది'' - అని తల్లి౮కి వివరించాదు
వీరబ్రహ్మేంద్రస్వామి. తర్వాత ఈ జనన మరణ చక్రాన్ని శాస్వతంగా వీడిపోయేందుకు, మోక్షాన్ని సాధించేందుకు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పాడు పోతులూరి.
బ్రహ్మంగారు చేసే కొన్ని పనులు వినేందుకు చాలా విచిత్రంగా ఉండేవి. ఆయన ఒకవైపు కొండగుహలో కూర్చుని కాలజ్ఞానం రాస్తూ ఉండేవారు. మరోవైపు పశువుల కాపరిగా తన బాధ్యతను నిర్వర్తించేవారు.
తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చేందుకు బయల్దేరిన వీరబ్రహ్మేంద్రస్వామి బనగానపల్లెకు చేరారు. ఆరోజు పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయారు. రాత్రికి ఆ ఊరిలోని ఒక ఇంటి వద్దకు చేరారు. నిద్రా సమయం ఆసన్నం కావడంతో అక్కడున్న అచ్చమ్మ అనే స్త్రీ ఇంటిముందు ఉన్న అరుగుపైన నిద్రకు ఉపక్రమించారు.
మరుసటిరోజు పొద్దున్నే అచ్చమ్మగారు, తన ఇంటి అరుగుమీద పడుకున్న వీరబ్రహ్మేంద్రస్వామిని చూశారు. ఈ సన్యాసి ఎవరో అని కుతూహలం కలిగి, ఆయనను వివరాలు అడిగారు. తాను బతుకుతెరువు కోసం వచ్చానని, ఏదో ఒక పని చేయదలచానని చెప్పగా, తన దగ్గర ఉన్న గోవులను తోలుకెళ్ళమని చెప్పింది అచ్చమ్మ. అలా గోవుల కాపరిగా మారిన వీరబ్రహ్మేంద్రస్వామి ఆవులను తీసుకుని దగ్గరలో ఉన్న రవ్వలకొండ దగ్గరకు వెళ్ళాడు.
ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం ఆయనను ఎంతో ఆకర్షించింది. ఆ ప్రదేశాన్ని కాలజ్ఞానం రాసి, అందరికీ తెలియజెప్పేందుకు తగిన ప్రదేశంగా నిర్ణయించుకున్నారు. ఒక గుహను తనకు ఆవాసయోగ్యంగా చేసుకున్నారు.
ప్రతిరోజూ గోవులను తీసుకుని వచ్చి, వాటిని పొలంలో వదిలిపెట్టి మనసును కేంద్రీకరించి ధ్యానంలో మునిగిపోయేవారు. ఆ ధ్యానం వల్ల ఆయనకు రకరకాల అనుభవాలు కలిగేవి. వాటన్నిటికీ అక్షరరూపం కల్పించేవారు.
కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న వీరబ్రహ్మేంద్రస్వామి అక్కడ ఉన్న ఒక తాటిచెట్టు ఆకులను కోసుకుని, కొండ గుహలో రాయడం మొదలుపెట్టారు.